గాంధీ

రాత్రి భయంకరంగా  అడవంతా పరచుకుంది. మిణుకుమిణుకు మంటున్న నక్ష్రత్రాల వెలుగులో ఎటువైపునుండి ఏ జంతువు మీద పడుతుందో , ఏ బందిపోటు మూక దాడి చేస్తుందో అనే భయంతో చిన్న చిన్న గుంపులుగా కదులుతున్నారు వారు. ప్రయాణం మొదలుపెట్టినప్పటి ఆశ, ధైర్యం సన్నగిల్లుతున్నట్టు కనిపిస్తుంది వారిలో. ఎటు వెళ్లాలో ఎలా వెళ్లాలో ఒక్కో గుంపు ఒక్కో రకంగా చర్చించుకుంటున్నారు తమంతా ఒక్కరుగా కదలితే ఎంత లాభమో తెలుసుకోకుండా!  అలా నడుస్తుండగా ఆ నిర్జణారణ్యంలో దూరంగా   దీపం వెలుగు కనిపించింది. వారిలో అలజడి. బందిపోట్లు ఎవరైనా కాపుకాస్తున్నారా? వేరే ఊరు ఏదైనా మొదలవబోతుందా?  ఎటుపోతే ఏ అనర్ధం వచ్చిపడుతుందోనని  ఎటూ తెముల్చుకోలేక తాము  ఉన్నచోటే ఉండిపోయారు . చివర్కి కొందరు యువకులు ధైర్యం చేసి విషయం కనుక్కునేందుకు వెళ్ళారు.



అదొక చిన్న కుటీరం, చుట్టూతా కంచె ఏర్పాటు చేయబడి ఉంది. నార వస్త్రాలు  కట్టుకున్న ఓ నడివయసు మనిషి కుటీరంలోంచి బయటకు వచ్చి ఎండు కట్టెలను పేర్చి మంటను చేస్తున్నాడు, రాత్రివేళలో కౄరమృగాలు కుటీరం వైపునకు రాకుండా ఉండడానికి. కాసేపు గమనించి, నమ్మకం కుదిరిన తరువాత ఆ యువకులు కుటీరం వద్దకు వెళ్లి ఆయనతో తమ పరిస్థితి  వివరించారు. వారికి ఆశ్రయం కల్పించడం కన్నా తనకు ఆనందదాయకం మరొకటి ఉండదని వారి బృందం మొత్తాన్ని స్వయంగా వెళ్లి కుటీరానికి తీసుకొని వచ్చాడు.  ఆ రాత్రికి పడుకునేందుకు ఆడవారికి, పిల్లలకు కుటీరం లోపల ఏర్పాట్లు చేశాడు.

మర్నాడు ఉదయం ఆ బృందంతో మాట్లాడుతూ తన పేరు శాంతనుడని, అమరావతి వాసినని భగవదనుగ్రహం పొందేందుకు సన్యాసం స్వీకరించి దేశసంచారం చేస్తూ ప్రస్తుతం ఈ అడవిలో  ఉంటున్నానని   వారి వివరాలు ఏమిటో ఈ కీకారణ్యం గుండా ఎందుకు ప్రయాణమౌతున్నారని అడిగాడు. బృందంలోని ఓ వ్యక్తి లేచి ఆయనకు నమస్కరించి తమ కథను వివరించాడు. "స్వామీ... మాది ఈ అడవికి ఆవల ఉండే స్వర్ణపురి గ్రామం. ధాన్యరాశులతో సిరిసంపదలతో అన్నపూర్ణగా భాసిల్లేది. కొంతకాలం క్రితం బందిపోటుల మా గ్రామం మీదకు దాడి చేసి మొత్తం ధ్వంసం చేశారు, దాచుకున్న సంపదను ధాన్యాగారాలను దోచుకున్నారు. మరొక చోట నివాసం ఏర్పచుకునేందుకు  వెడుతున్నాము. ఇప్పటికి పక్షం రోజులుగా ఈ అడవిగుండా వెడుతున్నాము. దారీతెన్నూ తెలియడము లేద "ని చెప్పాడు. వారి పరిస్థితి గ్రహించిన  శాంతనుడు ముందుగా ధైర్యవచనాలు చెప్పి  వారు సురక్షితంగా బయటకు వెళ్లేందుకు మార్గాన్ని, అరణ్యంలో సాగేపుడు తీస్కొవలసిన జాగ్రత్తలను, యే యే ఫలాలను తీసుకోవచ్చో వాటిని ఎలా ఎంచుకొవాలో, బందిపోటుల నుండి తమను తాము ఎలా కాపాడుకోవాలో,  ఎటువంటి ప్రదేశంలో కొత్త గ్రామాన్నిఎలా ఏర్పాటు చేసుకొవాలో ఇతరులపై ఆధారపడకుండా స్వశక్తి పై జీవించడం ఎంత ఉత్తమమో విపులంగా వివరించాడు. గుంపులుగా కాక అందరూ కలసి మెలసి ఉండాలని చెప్పాడు.  వారిలో కొందరిని ఎంచి నాయకులుగా తయారయేందుకు కావాల్సిన విలువలు, లక్షణాలు చెప్పి వారందరి సంరక్షణ బాధ్యతను ఎలా నిర్వహించాలో చెప్పాడు.

శాంతనుడు   క్రొత్త ఆశలు చిగురింపజేశాడు... అడవిలో కౄరమృగాల బారినపడి మరణిస్తామేమో అనుకున్న వారిలో ధైర్యం నింపాడు. శాంతనుడికి కృతజ్ఞత తెలియజేసి తమ ప్రయాణం కొనసాగించారు కొద్ది కాలానికి కొంగొత్త ’స్వర్ణపురి’ని ఏర్పాటు చేసుకున్నారు శాంతనుడు చెప్పిన మార్గంలో జీవిస్తామని నిర్ణయించుకున్నారు తమ కొత్త గ్రామంలో అతడిని దేవుడిలా కొలవసాగారు.
కాలం గడచింది, మానవ సహజమైన చపలత్వం వచ్చి చేరింది వారిలో. ఐకమత్యం కాదని ఎవరికివారు వేరని భావించడం మొదలు పెట్టారు. కొత్త మార్గాలను అన్వేషిస్తూ తమపై తాము నమ్మకాన్ని కోల్పోవడం మొదలుపెట్టారు. శాంతనుడికి తామే నిజమైన వారసులమని తమను ప్రభువులను చేస్తే స్వర్ణపురిని నిజంగానే కనక రాశులతో నింపుతామని, వేరే గ్రామలలోని సౌభాగ్యాన్ని అందిస్తామని అద్బుతాలు సృష్టిస్తామని ప్రకటించుకున్నారు కొందరు.  ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు వారికి...భవిష్యత్తుపై చీకటి మేఘాలు కమ్ముకుంటుండగా  శాంతనుడి కోసం వేడుకుంటున్నారు ’ఓ మహాత్మా... ఓ మహర్షి మళ్ళీ రా’ అని.










*********************************

ఐదారేళ్ల క్రితం గాంధీ జయంతి/వర్ధంతి/స్వాతంత్ర్య దినోత్సవం/ గణతంత్ర దినోత్సవం  సందర్భంగా  ’ఈనాడు’ సంపాదకీయంలో చదివిన వ్యాసానికి నా పైత్యం జోడించి రాసిన పోస్ట్ ఇది. అసలు ఆర్టికల్ రచయిత పేరు గుర్తులేదు.

**********************************

" తనకు కావలసిన నాయకత్వాన్ని సమాజమే తయారు చేసుకుంటుంది "
--- సహచర బ్లాగర్ శ్రీ బుద్దా మురళి గారు.


ఆ నాయకత్వం త్వరగా రావాలని కోరుకుంటూ...

చదువుకో పిచ్చి నాయనా నిన్నాపేదెవ్వరూ..

నిన్న మధ్యాహ్న సమయమున తిన్న భోజనము అరుగుటనూ, చలువమరల కృత్రిమ గాలినుండి కాస్త ఉపశమనమునూ ఆశించినవాడనై నా సహోద్యోగితో వాహ్యాళికి వెళితిని. ఆకాశము మేఘావృతమైయుండెను. దారిలో ఒక పక్కనుండి పురపాలక సంఘము వారి కుప్పతొట్టి వెదజల్లు గాలి, మరొక పక్కనుండి అదే పురపాలక సంఘము వారి ఉద్యానము నుండి వీచే మలయమారుతములు కలగలిసి ఒక విశేష్యమైన అనుభూతి కలుగుచుండెను. దినకరుడు మబ్బు చాటున దాగియుడుట వలన వేడిగా ఉన్నదని, లేదు చల్లగా ఉన్నదని చెప్పలేనటువంటి స్థితి ఉన్నది. అట్టి సమయమున నా సహోద్యోగి నన్ను చూచి "ఓయి, మనము ఇంత కష్టపడి కూర్చీలలో కూర్చొని బుద్దిని శ్రమింపజేసి, బొజ్జలు పెంచేది ధనము కొఱకే కదా! ఒకవేళ నీకు జీవిత పర్యంతమూ సరిపోవు అమితమైన ధనము వచ్చినదనుకొనుము దానితో నీవు ఏమి చేసెదవు" అని ప్రశ్నించెను. క్షణమైనా జాగు చేయక " అట్లైన ఒక గ్రంథాలయము సమకూర్చుకొని అందులో నన్ను నేను బందీగా చేసికొని జీవితాంతము పుస్తక పఠనము గావించెద"నని వ్రాక్కుచ్చితిని. అతను చిన్నగా దరహాసము చేసి "బాగుగా ఉన్నది. కాని నీవు ఆరోగ్యమను ఒక ముఖ్యమైన బంతిని మరచితివ"నెను.
"బంతా! అదియేమి?"
"అవును. ప్రతి మనిషి జీవితము కుటుంబము, స్నేహితులు, ఉద్యోగము, ఆరోగ్యము, ఆత్మ సంతృప్తి అను ఐదు బంతులుగా విభజించబడియున్నది. మనందరమూ ఈ ఐదు బంతులను సంబాళించుకొనుచు ఏ బంతిని యెళ్లవేళలా అట్టిపెట్టుకొననట్టు గారడి చేయవలెను. వీటిలో ఉద్యోగమనునది రబ్బరు బంతికాగా మిగిలినవి గాజు బంతులు - జారవిడిస్తే శాశ్వతముగా పగిలిపోగలవు.  దురదృష్టవశమున నేటి యువతీయువకులు రబ్బరు బంతి కధిక ప్రాధాన్యమునిచ్చు చున్నారు. ధనము వచ్చినది కాబట్టి నీవు ఆత్మ సంతృప్తి అన్న బంతికి అధిక ప్రాధాన్యమును ఇచ్చుచున్నావు, ఆరోగ్యమును విస్మరించుచున్నావు. అరోగ్యమే మహాభాగ్యమని కదా పెద్దలు కూడా చెప్పినద"నెను. అట్లేమి లేదు భోజమను చేయుటకు జల క్రీడలు గావించుటకు బయటకు వచ్చెదనని చెప్ప సంకల్పించితిని. అంతలోపే అతడు పరుగున కార్యాలయమునకు వెళ్లడముతో ఊరకుండినాను.

 కార్యాలయము చేరాక ఈ విషయముపై విచారించితిని. ఔరా! నిజమే కదా పుస్తక పఠమను గావించెదము సరే, కాని అవి వ్రాసే రచయితలకు ఆయా కథా వస్తువు ఎచటినుండి వచ్చును? సమాజము నుండియే కదా. ఒక్కొక్క కవి/రచయిత తనను స్పందింపజేయు విషయములను పరీశీలించును వాటిని గ్రంధస్తం చేయును. కొందరు రచయితలు సృజనాత్మకులు వీరికి సెలయేళ్ళు, నెమలి నాట్యము, కోమలి హంసనడకలు, వెన్నెల రాత్రులు, ప్రేమికుల విరహము కథా వస్తువులు ఎక్కువగా వాటి మీదనే రచనలు చేసెదరు. మరికొందరు పరిశీలురు వీరు సమాజం పోకడలను గమనించువారు. వ్యక్తిలోని గుణదోషములు సమాజముపై వాటి ప్రభావములు చర్చించెదరు.  ఇహంలో అగ్రరాజ్యముల పెత్తమము మొదలుకొని ఇంట్లోని అర్ధాంగి పెత్తనము వరకు వీరికి కాదేది అనర్హము. మరికొందరు భక్తి రక్తి ముక్తి మొదలగు విషయములపై మక్కువ కలవారు. ఇట్లు ఒక్కొక్క కవికి ఒక ప్రత్యేకమయిన ఆసక్తి ఉండును. వాటిని రచనలుగా మలుచును. అవి చదివినచో ఆయా విషయముల పట్ల జ్ఞానము కలుగును. సరియైన గురువు ఉన్నచో ఆ జ్ఞానమునకు తోడు విలువలు, వినయము కూడా సిద్దించుకొనవచ్చు దానినే 'విద్య' అనవలెనని నా నమ్మిక. ప్రస్తుతము మనయంతట మనమే నేర్చుచున్నాము కాబట్టి అది విద్య కాదు. చదువు అనుకొనెదము. పదములదేముంది అవి ఎట్లయినను వాడకొనవచ్చును.

 కావున కేవలము పఠనము చేసిన ఆయా రచయితల అనుభవమును తెలిసికొనెదము కాని మనకు స్వంత అనుభవముండదు, మనము మాత్రమే ఆనందించదగిన విషయములు కోల్పోయెదము. సమాజముతో సంబంధ బాంధవ్యాలు నెఱపుట ఎంతైనా అవసరము అని తెలుసుకొంటిని.


అటుతరువాత అసలు ఈ పఠనము ఎన్ని విధములు అని నన్ను నేను ప్రశించుకొంటిని. మొదటిది పత్రికా పఠన విధము- ఈ వర్గంలోని వారు ఏమి చదివినా ఆమూలాగ్రము చదువుదురు. ఎంతబాగా చదివాము అన్నది తప్పితే ఏమి చదువుతున్నాము అన్నది పట్టదు.వదిలేస్తే  ఇహపరములను కూడా మరచిపోవుచుందురు. book worm - ఆంధ్రీకరించిన, పుస్తకము పురుగు అని ఖ్యాతినార్జించెదరు.




రెందవది పరీక్షా పఠనము. పరీక్షలాసన్న మైనపుడు విద్యార్ధులు, ముఖ్యముగా ఇంజనీరింగ్ విద్యార్దుల చదువులాగా ఉండును. కనురెప్ప మూసి తెరిచేలోపు పుంఖాను పుంఖాలు తిప్పెదరుగాని సంగ్రహించెడిది అల్పము. విద్యార్ధులు మార్కుల కోసము చదివినట్టు 'మమ' అన్నవిధముగా కానిచ్చెదరు.


పఠమనము ఏ విధము అయినను అది ఎన్నో ప్రభావములు కలిగించును. కొందరిలో సంతృప్తి కలుగును, కొందరిలో అంతవరకూ ఉన్న సందేహము నివృత్తి అగును-అమితానందము కలగును, కొందరిలో కొంగొత్త సందేహములు వచ్చును, కొందరికి ఏహ్యభావము వచ్చును, కొందరికి ఆయా విషయములలో ఆసక్తి ద్విగుణీకృతమగును.అందరిలో సమానముగా కాకపోయినా ఎక్కువ శాతం జనులకు తాము కూడా రచనలు సల్పవలెనని అనిపించును, అధమము తాము నేర్చికొనినది నలుగురికీ చెప్పవలెనని అనిపించును. నలుగురూ చేరిన చోట తాము కొత్తగా చదివిన (అది ఏ విధము అయిననూ) పుస్తకమో, పత్రికలో వచ్చిన వ్యాసము గురిమ్చి చర్చింటుయయో జరుగును కదా అది ఒక నిదర్శనము. తాము చెప్పెడిది ఎవరూ పట్టించుకొననపుడు మేధావి మాటలు సామాన్యులకు అవగతము కావనుకొందురు, వారికా భాగ్యము లేదనుకొందురు. తమలో తామే ప్రశ్నించుకొనుచు సమాధానలు వెతుకుచుందురు. స్థోమత పేరు ఉన్నవారు తమ ఆలోచనలు ముద్రించెదరు. సాంకేతిక పరిజ్ఞానము పెరగడముతో సామాన్యుడికి సైతం తమ ఆలోచనా ఝరి ఇతరులతో పంచుకొనెడి అవకాశమేర్పడినది.

రచనలు మన స్వంతముగా చేసినను మనము చదివిన అభిమాన రచయితల ప్రభావం ఎంతయినా ఉండును. సదరు రచనలు/ప్రక్రియలు సమాజమునకు నచ్చితే గురువును మించిన శిష్యుడనెదరు లేకపోతే కాళిదాసు కవిత్వము కొంత వీరి పైత్యము కొంత అని నొసలు చిట్లించెదరు. ఇక్కడ కథకుల గూర్చి చెప్పవలసిన ఆవశ్యకత ఉన్నది. ఏ కారణము కొఱకు రచనలు చేసిననూ కొందరు తాము ఎవ్వరు అనేది చెప్పుటకు ఇష్టపడరు మారు పేరుతో వ్రాసెదరు. వారు మనకు బాగా పరిచయమున్నవారు కావచ్చును తాముగా బయటపడితే తప్ప అది వారేనన్నది ఎవరికినీ తెలియదు. తాము ఎందుకు, ఎక్కడ, ఏ విషయము గూర్చి వ్రాస్తున్నమో కూడా గ్రహించక వ్రాసెడి వారునూ కలరు. అట్టివారు తమ రచనల వాలనే ప్రభావితులైరని తెలియవచ్చినపుడు సదరు ప్రభావమునకు కారణమైనవారు  ప్రప్రధమముగా తామెందుకు రాయాల్సివచ్చెనని చింతించెదరు.
మరి కొందరు తమ పాఠకులలోని రచయితను బయటకు తీసుకువచ్చుటకు ప్రయత్నించెదరు. ఉదాహరణకు ఆండి, ఫోటాన్ అను యువకులు. వీరిలో ఒకరు తేరగా వచ్చినదని చదివేసి వెళ్ళిపోతే కత్తి ప్రయోగము చేసెదమని హెచ్చరింతురు. పాఠకులకు మంచి అవకాశం ఇవ్వుటకే తాముంటిమని చెప్పెదరు. మరొకరు కత్తి కంటే మర ఫిరంగుకు ఎక్కవ శక్తి ఉంటుందని తమ అభిప్రాయము నేరుగా చెప్పకనే చెప్పుదురు. కూలంకషముగా సామ దాన భేద దండోపాయములు ఉపయోగించుచూ ఉత్తేజ పరిచెదరు. వీరి కృషి శ్లాఘనీయమూ, వీరు మన మధ్య ఉండుట మిక్కిలి ముదావహము. తాము వ్రాయడమే కాక ఇతరులు వ్రాసినవీ చదువుచూ నలుసంత బాగా వ్రాసినా నల్ల ఏనుగంత బాగా వ్రాసినారు అని ప్రోత్సహించే వారునూ కలరు. ఒక్కో పర్యాయము వారి మాటలలో నిజము కూడా ఉండును. తరచి చూసిన వారికి పుంఖాను పుంఖాలుగా వ్రాసే మరియూ లెక్కకు మిక్కిలి రచనలు చదివే ఓర్పు ఎక్కడిదని మనకు ఆశ్చర్యము కలగును. ఉదాహరణకు రసజ్ఞగారి లాంటివారు. వీరు ఎక్కడెక్కడి నుండో సేకరించి  సుందరమైన వర్ణ చిత్రములు, చక్కని పద్యములు తెచ్చెదరు వాటి చరిత్రమునూ అర్ధమునూ వివరించెదరు. అంతటితో ఆగక ప్రతిఒక్కరి రచనలు చదువుతూ బాగుగా వ్రాస్తున్నారని మెచ్చికొనెదరు. ప్రోత్సహించుచూ చేసే వ్యాఖ్యలే మిక్కిలిగా ఉంటే అసలు వారు ఎన్ని రచనలు చదివెదరొ ఊహించికొనవచ్చును. అసలు అంత ఓర్పు వారికి ఎలా వచ్చినదో నా మోకాలును  ఎంత scratch చేసినా రహస్యము catch అవదు. మరికొందరు అద్భుతముగా వ్రాయగలిగే నేర్పు ఉన్ననూ అతి తక్కువగా వ్రాసెదరు. మరికొంత వ్రాయవచ్చుగా అని అభిమానులచేత 'చిన్నపిల్లల' మాదిరి బ్రతిమాలించుకొందురు కాని వారు కోరిక మన్నించిరా ? ప్రసన్నులైరా అని ప్రశ్నించుకొంటే ప్రశ్ననే మిగులును.

అసలు ఈ చాంతాడంత వివరణ ఎందులకు చెప్పుచుంటివి అని మీరు ప్రశ్నించవచ్చును. నించకున్ననూ చెప్పవలసిన బాధ్యత నాకు ఉన్నది. నిన్న పుస్తకముల గురించి ప్రస్తావన వచ్చినది కదా, ఆ ప్రస్తావన ఆలోచనగా మారి పెరిగి పెద్దదయి  ఒకానొక పుస్తకము తీసుకొన సంకల్పించి 'విశాలాంధ్ర' కేగితిని. ఒక పుస్తకము కాస్తా పెక్కు పుస్తకములైనవి, చివరకు కొనదలచిన పుస్తకము తీసుకొనలేదు. కొత్తవాటితో కలిపి 'నిశ్చయముగా చదివెద'ననుకొని తీసుకున్న పుస్తకములు తిరుపతి వెంకన్న బాకీ వలె పెరిగిపోయినవి. అమితోత్తేజముగా గృహమునకు వచ్చిన మీదుట మత్ మాతాశ్రీ వాటిని చూచి ఎందులకురా ఇన్నేసి పుస్తకమణులు తెచ్చెదవు నీవా చదవవూ వాటిని అమ్మివేయనీయవని విచారము వ్యక్తము చేసి నన్ను విచారమునకు గురి చేసినది. అయినా ఆ విచారము కొంతసేపే ఏల అనగా,



వీకెండు ముచ్చట్లు....

అటెన్షన్ ప్లీజ్, రియల్ వరల్డ్ నుండి బ్లాగ్ వరల్డ్,  ఫ్లయిట్ నెంబర్ RB5512 మరి కొద్దిసేపట్లో ల్యాండ్ అవబోతుంది.....

హలో హలో హలో.... బాగున్నారా అందరూ. Very glad to see you all :)
అరె ఏందిది!  నా రాకను పురస్కరించుకొని స్వాగత హారతులిచ్చి, గజమాలలు వేసి, గజారోహణం చేయించి పురవీధులలో ఊరేగిస్తారనుకుంటే  ఇంత తక్కువ జనాలా!? వీకెండును అంతబాగా ఎంజాయ్ చేస్తున్నారా. అబ్బోస్ మీకొక్కరికేనేంది  మాకూవుంది వీకెండు, మేము చేశాం ఎంజాయ్‌మెంటు. ఇగో ఈ పోస్టు నిండా ఆ సంగతుల్ స్మృతుల్ నింపేస్తాను చదివి ఆనందిద్దురుగాని..


ఉపాద్ఘాతము
అనగా అనగా అనగా... ఒక నెలరోజుల క్రితం హైదరాబాద్ నగరమందు ఉండెడి ఇద్దరు  ఘోటక బ్రహ్మచారులకు సాటి గుంటూరు వైద్య బ్రహ్మచారి తన అమృతహస్తములతో చేసే వంటలను  రుచిచుడ మనసైనది. పరస్పరం చర్చించుకున్నమీదట ఓ మంచి శుక్రవారం ( ఈ పదం యొక్క పుట్టుపూర్వోత్తరాల కోసం 'డైరీ'ని, ఇది ఎంత మంచిదో తెల్సుకునేందుకు 'పాకవేదాన్ని' తిరగేయండి)  గుంటూరు బయలుదేరవలెనని , ఈ కార్యాచరణకు వ్యతిరేకంగా హరిహరాదులు ఏకమైనను ప్రతిఘటించి వాటిని విఘటించి (అర్ధం వెతకొద్దు, మాఆఆంచి ఫ్లో లో వచ్చేసింది) వెళ్ళవలెనని అనుకుంటిరి. ప్రయాణానికి రెండు రోజులనగా ఎర్పాట్లలో నిమగ్నమైన పెద బ్రహ్మీకి  చిన బ్రహ్మీ నుండి కాల్ వచ్చినది. ఏమిటి నాయనా అని అడగ్గానే అవతలి వైపునుండి ఒకటే ఏడుపు.



"మా మేనేజరుడు సెలవు ఇవ్వననీ, పాలుగారే పసివాడినని కూడా చూడకుండా నాతో వెట్టిచాకిరి చేయించుచున్నాడు బాబోయ్. నేను రాలేను వాఆఆఆఆఆఆఆఆఆ"
"ఒస్ అంతేనా, ఈ చరాచర సృష్టిలో ఏ మేనేజరుడు అడిగిన వెంటనే సెలవు ఇస్తాడుగనక మీవాడిని గూర్చి అంతలా దుఃఖించడానికి. నువ్వే గట్టిగా ప్రయత్నం చేయ్యాలి. కాదు కూడదు అంటే ఏదో జబ్బు చేసింది టాబ్లెట్లు కొనడానికి గుంటూరు వెళ్ళాలి అని చెప్పు. అదియునూ కుదరదంటే చెప్పాపెట్టకుండా వచ్చెయ్, తిరిగొచ్చాక కారణం అడిగితే యాక్సిడెంట్ అయ్యిందని చెప్పు, చెయ్యడానికి నేను కట్టుకట్టడానికి డాట్రు ఎంతోకొంత సహాయం చేస్తాం" అని ఉపాయం చెప్పాడు పెద బ్రహ్మీ. భయంవల్ల అనుకుంటా అంత చెప్పినా పాపం అతను ధైర్యం చేయలేకపోయాడు. సరే ఇతగాడు రాలేడు కదా తోడుగా మురళీధరుడిని వెంటబెట్టుకు వెళదాం అని యోచించి అతడిని సంప్రదించాడు, చివరకు అతను కూడా 'నామాలు' పెట్టడంతో విధి బలీయమైనది,ఈమారు తనకొక్కడికే అమృతపాన యోగమున్నది కాబోలని తలంచి బయలుదేరెను.


అధ్యాయము
తెల్లవారుఝామున గుంటూరులో బస్సు దిగగానే కౌటిల్య ఫోన్ చేశాడు, "వందేళ్లు డాట్రు. ఇప్పుడే బస్సు దిగాను నీకు ఫోన్ చేద్దామనుకునే లోపు నువ్వే చేశావ్. ఇప్పుడు ఇక్కడి నుండి ఎలా రావాల"ని అడిగా.
" నీ ఎదురుగా, చుట్టుపక్కలా ఏదైనా విగ్రహం ఉందా" - అవతలి వైపునుండి ప్రశ్న
"ఆ ఉంది"
"అయితే కొంచెం బాడి రైట్ టర్నింగ్ ఇచ్చుకొని తిన్నగా ఓ అరకిలోమీటర్ వచ్చెయ్... ఈసారి  మూడు విగ్రహాలుంటాయ్. వాటిని దాటుకుంటూ పదడుగులు వేస్తే రామాలయం పక్కన ఇంకొక విగ్రహంలా నేను ఉంటాను"
ఈ విగ్రహాల భాషేంటో అర్ధం కాక కొత్త ఊర్లో తెలీనోళ్లతో ప్రశ్నలు ప్రయోగాలు ఎందకని ఇచ్చిన డైరెక్షన్స్ ను యాక్షన్ లో పెట్టా. గుడి దగ్గరరికి చేరుకోగానే డాట్రు హనుమంతుడిలా వచ్చి తన రూంకు తీసుకొనిపోయాడు. ఎప్పుడు చూసినా వంటలూ పుస్తకాలని అంటువుంటాడు లంకంత కొంప ఉంటుందనుకున్నా. అబ్బే సింగిల్ రూము! book rack మాత్రం ఉంది  "ఇదెంటిది, త్రిబుల్ కిచెన్ + బెడ్‌రూం+హాల్ ఊహించుకున్నాను. నిత్యం రుబ్బురోళ్ల చప్పుడుతో, పెనం మీద ఐటెమ్స్ ఘుమఘుమలతో అలరారుతుందనుకుంటే నన్ను ఇక్కడికి తీసుకొచ్చావ్. ఇది నీ రూమేనా"ని అడిగితే హిహ్హిహ్హి అని నవ్వేసి, వంట చేసుకుంటే ఇదే కిచెను, చేసింది తింటె ఇదే డైనింగ్ రూము, చదువుకుంటుంటే ఇదే హాల్, పడుకుంటే ఇదే బెడ్‌రూము అని బ్రహ్మీఙ్ఞాన ఉపదేశం చేసి తను స్నానం పూజ కానిచ్చేలోపు కంప్యూటర్‌లో మొహం పెట్టి నెట్టింగో కుర్చిలో దేహం పెట్టి రీడింగో చేసుకొమ్మని బంపర్ ఆఫర్ ఇచ్చాడు.

స్నానాలవీ కానిచ్చాక ఆ రోజు అమరావతి వెళ్ళాలని అనుకున్నాం. బ్రేక్‍ఫాస్ట్ చేద్దామని "పద కౌటిల్యా..అలా దారిలో ఎక్కడైనా దోశలో ఇడ్లీలో తిందామ"న్నా. శంకరాభరణంలో శంకర శాస్ర్తిలా "చారీ..." అని కౌటిల్య అనేసరికి కొంచెం భయపడ్డా. మా ఊరికి వచ్చి అందునా నా ఇంటికొచ్చి ఎక్కడో బయట తింటానంటావా. వండిపెడదామని సరుకులన్నీ తీసుకొచ్చా.అలా కూర్చొని ఉండు వేడి వేడిగా దోశలు వేస్తానని చెప్పి కూర్చొబెట్టాడు. గుంటూరు మిర్చి ఘాటు తగులుతుందేమో అనుకున్నా..... పోయినసారి వేణు శ్రీకాంత్ గారు వచ్చినపుడు చాలా వాడేసాడంట నాకు కొన్నే మిగిలాయి happy. కౌటిల్య ప్లేట్లో దోశలు వేస్తుంటే వాటిని తింటూ జనాలను ఉడికించడానికి ప్లస్సులో పోస్టులు వేసా. తినడం ముగించి బయలుదేరబోతుండగా శేఖర్ ఫోన్ చేశాడు పది నిముషాల్లో వస్తానని. సరే ముగ్గురం కలిసి బయల్దేరదాం అనుకొని ఓ గంటసేపు వెయిట్‌ చేశాం.గంట దాటాక పదినిముషాలకు శేఖర్ వచ్చాడు. బ్లాగు ఫొటోలో చూసి నాలాగే యువబ్రహ్మీ అనుకున్నా....అమితాబ్ బచ్చన్ హైటుతో ప్రసన్నవదనంతో ఉన్న పెద్ద (అలియాస్ ముదురు) బ్రహ్మీనే!! రావడం రావడమే 'ఎక్కడ ఎక్కడ వంట సామాన్లెక్కడ' అనడగడం మొదలెట్టాడు. ఇతగాడి గురించే కాబోలు డాట్రు ఆ సామాన్లన్నీ మంచం కిందకు సర్దేసాడు ;)
ఈ బాబు గురించి రెండు ముక్కలు చెప్పాలి. చూడడానికి నోట్లో వేలు పెడితే కొరకలేని అమాయకుడిలా కనపడతాడుగాని సైలెంట్ గా పంచులు వేస్తాడు. ఎవడ్రా అన్నాడు అని మనం చుట్టుపక్కల చూస్తే ఇలా అమాయకమైన ఫేస్ ఒకటి కనిపిస్తుంది


ఛ... ఇలాంటి  ఉత్తముడినా అనుమానించింది అనుకునేలోపే ఇంకో పంచ్ పడుతుంది. గుంటూర్ లో ఉన్న మూడు రోజులు పాపం డాట్రు, శేఖర్ పంచ్‌లకు బలైపోయాడు sad  పిచ్చాపాటి కబుర్లు చెప్పుకొని ఇక లంచ్ చేసి బయల్దేరదామని లంచ్ కోసం వండడం మొదలు పెట్టాడు డాట్రు. ఏసీ లో కూర్చోబెట్టి పొయ్యి దగ్గర తను కష్టపడుతుంటే గుండె తరుక్కుపోయింది. పోని మేమేన్నా సాయం చేయమా అని శేఖర్ అడిగాడు. "బాబు ఈ ముక్క బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నపుడె అడిగా... ఉహూ, ఇల్లే, నహీ అంటున్నాడు. అథిది మర్యాదంట. అంతగా సాయం చేయాలనుంటే కమ్మగా మజ్జిగ చేసి ఇస్తాడు. తాగి పెడదాం" అన్నా. ఉత్తినే ఫార్మాలిటి కోసం అడిగా చారి. నిజంగా చేస్తామా ఏంటి అన్నట్టు ఏదో వినపడితే తిరిగి చూసా. చెప్పాను కదా.. పైన పెట్టిన ఫేస్ కనిపించింది. 
ఏమాటకామాటే డాట్రు పప్పు చేశాడూ, వేడివేడి అన్నంలో వాళ్లింట్లో చేసిన నెయ్యి వేసుకొని తింటే అనిపించింది... ఆహా నభూతో నభవిష్యతి. ఈ కాలపు ఆడ స్త్రీలేడిస్ కు వంట నేర్పగల ఏకైక వ్యక్తి మా డాట్రే  అంటే అతిశయోక్తి కాదు (హమ్మయ్య తాంబూలాలిచ్చేశా ఇక....  winking) సుష్టుగా తిన్నాక ఎటూ కదల్లేని స్థితిలో ఉన్నామని గ్రహించి అమరావతి వద్దు ఆదమరచి నిద్రపోదాం అని డిసైడ్ చేశాం. రాత్రికి వేణుగారు టైటానిక్ సినిమాకు టికెట్లు బుక్ చేశారు. నడి సముద్రంలో, గాలివానలో టైటానిక్ మునిగిపోవడం చూస్తూ మధ్యమధ్యలో జోకులేసుకుంటూ సినిమా ముగించాం. సమయంలేక వేణు గారితో ఎక్కవ మాట్లాడలేకపోయా.

ఆ తరువాతి రోజు ఉదయమే లేచి నేను డాట్రు అమరావతి వెళ్లి అమరేశ్వరుని దర్శనం చేసుకున్నాము. గుడి దగ్గర కృష్ణానదిని చుస్తే చాలా బాధేసింది. నీళ్లన్నీ ఎండిపోయి పిల్ల కాలవలాగా కళావిహీనంగా ఉంది, ఒక రకంగా హైదరాబాద్‌లో మూసి లాగా ఉంది. గుడినుండి ఆర్కియాలజి మ్యూజియం, పక్కన ఉన్న పార్క్ వెళ్ళాము. డెవలప్‌మెంట్ హైదరాబాలోనే కాదు అమరావతిలో కూడా ఉంది అని పార్క్ లో ఓ జంటను చూసాక తెలిసింది. సాయంత్రం శేఖర్ తో కలిసి విజయవాడ దుర్గమ్మ దర్శనం చేసుకున్నాము. వెళ్ళిన మూడు చోట్లా కౌటిల్య చక్కగా స్తోత్రాలు చదువుతుంటే గుడికి వచ్చినవాళ్ళు, పూజారులు మమ్మల్ని ఒక విధమైన గౌరవంతో చూసారు, రద్దీగా ఉన్నా వేళ్లెందుకు మాకు దారినిచ్చారు. కౌటిల్య వల్ల దుర్గమ్మను చాలా దగ్గరగా సుమారు అరగంటపాటు దర్శించుకునే అవకాశం కలిగింది . ఆ తరువాతి రోజు ఉదయం మంగళగిరి వెళ్ళాము.
మంగళగిరి కొండ ఒక అగ్నిపర్వతమంట....అది బద్దలవకుండా ఉండేందుకు కొండమీద కొలువున్న నరసింహస్వామి నోట్లో బెల్లం నీరు పోస్తారు. అగ్నిపర్వతం బద్దలవడం అనే ఓ క్లిష్టమయిన సమస్యను  నిత్యం నీరు పోయడం ద్వారా తీర్చడమనే ఆలోచన ఆశ్చర్యంగా అబ్బురంగా అనిపించింది. వైఙ్ఞానికంగా అదొక అద్బుతం. కాని నిత్యం నీరు ఎవరు పోయాలి? ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇక్కడే భక్తి అనే అంశాన్ని చేర్చి ప్రజలే ఆ పని చేసేలా మలిచిన మన పూర్వీకులను మెచ్చుకోకుండా ఉండలేకపోయా.

వెంకటగిరి నుండి గుంటూరు తిరుగుప్రయాణమయ్యి కాసేపు రెస్ట్ తీసుకున్నాక 'బ్లాగు పుస్తకం' పరిచయ సభ కోసం, నేను అటునుంచి అటు ఇంటికి వెళ్ళడం కోసం మళ్ళీ విజయవాడ వెళ్ళాం. పుస్తక పరిచయ సభకు వెళ్ళే ముందు విజయవాడలో పుస్తకాల షాపింగ్ చేశాం, సుజాతగారు రెహ్మాను.. వీళ్లందరిని తీసుకొనొస్తే మాకు కొనుక్కొడానికి ఇంకేమి మిగలవని డాట్రు ప్లాను :) మేము వేళ్లేసరికి సభ ప్రారంభమయింది. 'ఆది బ్లాగర్' చావా కిరణ్ గారు (ఇలా అనాలి అని కౌటిల్య చెప్పాడుమరి, కారణాలు తెలియవు winking ఎప్పటిలాగే నవ్వుతూ సభ ఏర్పాట్లు చేస్తున్నారు.  నేను శేఖర్ బుద్దిమంతుల్లా ఆఖరు వరుసలో కూర్చున్నాము. మేము ఇంత బుద్దిగా ఉన్నా కూడా రెహ్మాన్‌కు నచ్చలేదేమో సుజాతగారితో ఏదో చెప్పి మా ఇద్దరితో పుస్తకం ఆవిష్కరింపచేశాడు . అంటే మొత్తంగా మాతోనే కాదు 'షాడో' మధుబాబుగారి లాంటి పెద్దవారు చేశాక కూడా కొన్ని మిగిలిపోతే ఫొటొలో నిండుగా కనపడడానికి ఫిల్లర్స్ లా అన్నమాట ;)
అయినా రచయితల ఆదరం చూస్తే ముచ్చటేస్తుంది. మొన్న హైదరాబాలో సభ  చేసినపుడు వెళితే పుస్తకం బహుమానంగా ఇచ్చారు. ఇప్పుడేమో ఆవిష్కరణ చేయమన్నారు, రేప్పొద్దున్న పుస్తకం రాస్తూ నాకు అంకితం ఇచ్చేస్తారేమో అని అనిపిస్తుంది వీళ్ల అభిమానం చూస్తే. నాలాంటి పెద్దలను గౌరవిస్తుంటే కాదనలేకపోతున్నాను కూడానూ big grin సభకు విజయవాడ, ఆ చుట్టుపక్క బ్లాగర్లు చాలామంది వస్తారు వారందరిని కలవచ్చు అనుకున్నాను, ప్చ్, 'తెలుగుకళ' పద్మకళగారు ఒక్కరే వచ్చారు.

సభ అయ్యాక మరోసారి పుస్తకాల షాపింగ్ చేసుకొని శేఖర్‌కు సెండాఫ్ ఇచ్చి, కిరణ్ గారితో చిన్న మిర్చిబజ్జీ పార్టి చేసుకొని ఆయన/రచయతలు ఇచ్చిన డిన్నర్ స్వీకరించి బస్ స్టేషన్ చేరుకున్నా. సరిగ్గా అదే సమయానికి మూర్తి అక్కడే ఉన్నాడని తెలిసింది. మేము వచ్చాక తెలిసిందేంటంటె తను అంతకుముందే బయలుదేరాల్సిందని, కలిసి వెళ్ళొచ్చని తన టికెట్ కాన్సిల్ చేయించుకున్నాడట. ఏమిటో ఈ బ్లాగానుబంధాలు. అంతకుముందెన్నడూ  ప్రత్యక్ష పరిచయం లేకపోయినా కేవలం బ్లాగ్/ప్లస్సు పరిచయం ఉన్నందుకు వాళ్లను కలవాలనుకోవడమూ, కలిసాక ఆనందపడటమూ, మొదటిసారి కలిసినా ఎప్పటినుండో పరిచయం ఉన్నవాళ్లలాగా మాట్లాడేసుకోవడమూ.. ఒక్కోసారి ఆశ్చర్యంగా ఉంటుంది. తన 'పల్లీ పొట్లం' గురించి మాట్లాడుకుంటూ ఇంత చక్కని ఙ్ఞాపకాలను అందించిన  కౌటిల్యకు, వేళ్లేంతవరకు అక్కడే ఉన్న రహ్మానుకు వీడ్కోలు చెప్పేసి హైదరాబాద్ బయలుదేరాము.


PS: నువ్వు ఎక్కదలచిన రైలు ఒక జీవితకాలం లేటు అన్నట్టు బహులేటుగా శేఖర్ కోరిక మేరకు రాసిన ఈ పోస్ట్ అంతకు ముందు మాట ఇచ్చిన ప్రకారం చాణక్యకు అంకితం.


ShareThis