సొగసు చూడతరమా....



రష్యాలో కనపడే సైబేరియన్‌ పులి ఇది. మన బెంగాల్‌ పులులు రాజసానికి పెట్టింది పేరైతే సైబేరియన్‌ పులులు చూడ్డానికి అందంగా వుంటాయి. చలి ప్రదేశాల్లొ నివాసం కాబట్టి చర్మం మీది వెంట్రుకలు దట్టంగా, ముదురు రంగులో ఉంటాయి. ముదురు గోధుమ రంగుపైన నల్లని చారలతో గ్లామరస్‌గా ఉంటాయి. ఫోటొ జూస్తే తెలుస్తలే..
అడవుల నరికివేత, మనుషుల వేట కారణంగా వీటి సంఖ్య ప్రమాదంలో పడిపోయింది.
ఫోటొ విషయానికి వస్తే ఈ pose లొ బంధించడానికి ఫొటొగ్రాఫర్‌ గంటల తరబడి దాని చుట్టుపక్కనే ఉండాల్సి వచ్చిందట. చాలా దగ్గరినుండి తీసాడంట...ఎలా ఉండగలిగాడో మరి.


పెపంచకంలో ఇంతకన్నా సుఖమైన పని ఏమైనా ఉంటుందా బాబయ్యా.
ఏ చేప పిల్ల దొరికిందని కలగంటుందో ఏంటొ...డిస్టర్బ్‌ చేయకండి

ద్రువపు ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే సీళ్ళ చర్మం కోసం, వాటి కొవ్వు నుండి తీసే నూనెల కోసం ఒకప్పుడు వీటిని విచ్చలవిడిగా చంపేసేవారు.



హిమాలయాలు, నేపాల్, చైనా ప్రాంతంలో కనపడే ఎర్ర పాండాలు ఇవి. Fire Fox అనికూడా అంటారు. నలుపు-తెలుపు పాండాల దగ్గరి పొలికల్తో ఉంటుంది. వాటిలాగే శాకాహార జీవి. అధికారిక లెక్కల ప్రకారం వీటి జనాభా సుమారు 2500.
అడవుల నిరికివేత కారణంగా వీటి మనుగడ ప్రమాదంలో పడింది.








కోరల్‌ రీవ్స్‌...భూమిపైన జలంతర్భాగంలో ఉండే స్వర్గం. వీటి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డిస్కవరీలోనో, Nat Geoలోనో చూసేఉంటారు. వీటి చుట్టుపక్కల ఉండే జీవవైవిద్యం ఎక్కడా ఉండదు. సెంటీమీటరు సైజు చేపల నుండి పదడుగుల పొడవుండె షార్క్‌ చేపల వరకు అన్నీ కనిపిస్తాయి. భూవాతావరణంలోని ఉష్ణొగ్రతల మార్పులకు చాలా ప్రభావితమౌతాయి. సముద్రపు ఉప్పు శాతం పెరిగినా, సాధారణ ఉష్ణోగ్రత పెరిగినా ఇవి దెబ్బతింటాయి.



ఉత్తర, దక్షిణ అమేరికాలలో ప్రముఖంగా కనిపించే కౌగార్‌ పెద్దపిల్లులో నాలూగో అతిపెద్దది ( పులి, సింహం, జాగ్వార్‌ ల తరువాత ). ఇప్పటికైతే వీటి మనుగడకొచ్చిన ముప్పేమీలేదని WWF చెబుతుంది. కానీ కొన్ని అమెరికా రాష్ట్రాలలో వీటిని వేటాడటం చట్టబద్దమేనట. ఆ రకంగా ప్రమాదంలో ఉంది.








తలమే బ్రహ్మకునైన నీ నగమహత్వఁ బెన్న.....
( పదో తరగతిలో ‘ప్రవరుని స్వగతం’లో చదివిన పద్యం, వ్యాకరణ దోషాలేమైన ఉంటే మన్నించండి)

ఇంజనీరింజ్‌లో మేము మనాలీ వెళ్ళినప్పుడు తీసిన ఫోటొ . రోతాంగ్‌ పాస్‌ వేళ్ళే సమయానికి మంచు ఏక్కువ కురుస్తుందని ఆ దారి మూసేసారు.....చివరికి సోలాంగ్‌ valleyకు వేళ్ళాం.దారిలో తీసిన క్లిక్కు ఇది. హైదరాబాదులో చిన్న గుట్టలే చూసిన నాకు అంతంత పెద్ద కొండలు చూసేసరికి ఎవరూ కొట్టకుండనే దిమ్మతిరిగి మైండ్‌ బ్లాకైంది. తెల్లటి మంచుకొండలపైన ఎండపడి వెలిగిపోతుంటే......చూడ్డానికి నాలుగు కళ్లు చాలలేదు ( నాకు కళ్ళజోడు ఉందిమరి).
పెరిగిపోతున్న భూవాతావరణం కారణంగా వీటిపైన ఉండే మంచు త్వరగా ( ఎండాకాలం ముందుగానే) కరగుతుందంట.
ఇలాగే కొనసాగితే మున్ముందు అక్కడ రాళ్లకొండలే ఉంటాయి కాబోలు.

టాపా రాస్తుంటే winampలో ‘ఓయ్!’ సినిమా పాట ప్లే అవుతుంది...,
"అనుకోలేదేనాడు  ఈ లోకం నాకోసం
అందంగా ముస్తాబైవుంటుందనీ...."
నాకోసం సరే అందంగానే ఉంది......కాని వచ్చే తరానికి.....?
వీటి సొగసు రానున్న తరాలు చూడశక్యమా......

‘మద్య’వర్తి.....

వారం రోజుల క్రితం గుజరాత్‌లో కల్తీమద్యం తాగి సుమారు 130 మంది మరణించారు. గుజరాత్‌ రాష్ట్రంలో 1961 నుండి మద్యనిషేదం అమల్లొవుంది. కాబట్టి సహజంగానే అక్రమ మద్యవ్యాపారం అక్కడ బాగానే జరుగుతుంది. దినికి బానిసలైనవారు ఎలాగూమానలేరు కాబట్టి వ్యాపారులు అక్రమ మద్యం తయారుచేయడం మాత్రమేకాక దాన్ని కల్తీ కూడా చేయడం ప్రారంభించారు. ప్రభుత్వ యంత్రాంగం ఉదాసీనత, అక్రమమద్య వ్యాపారుల స్వార్థం అన్నీ కలిసి ఇటీవలి మరణాలకి కారణం అయ్యాయి.
దీమిపైన చాలా దుమారమే చెలరేగింది. మద్యంపైన నిషేధం ఉన్నాక్కూడా అక్రమమద్యం ఎలా దొరుకుతుందనీ, అసలు గాంధీ రాష్ట్రంలో మద్యంతాగి ప్రజలు చనిపోవటం ఏంటని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు నానాయాగి చేశాయి.


ఈ సిన్లో ఒకాయన చేసిన వ్యాఖ్య కొన్ని రోజులుగా నాకు చికాకు కలిగిస్తుంది ( తిక్కరేగ్గొడుతుంది అంటే బావుంటుంది ). సందట్లో సడేమియాలాగా ఆయనగారు తన వ్యాపారవ్యూహాలను ఇలాంటి సందర్భంలో దూర్చాలనుకోవడం మరీ రోతగా ఉంది. ఆ మనిషి ‘లిక్కర్‌కింగ్‌’గా పిలవబడే బిజినెస్‌ టైకూన్‌ విజయ్‌ మాల్యా.
సంఘటన జరిగిన కొన్ని రోజులకు కింగ్‌గారు విలేఖరుల సమావేశంలో ఈ విధంగా అన్నారు ,"మన రాజకీయ hyopocrites ఇకనైనా మేల్కోవలసిన సందర్భమిది. ప్రజలకు ఏం కావాలో వాళ్లే నిర్ణయం తీసుకునేటట్లు శాసనకర్తలు తగిన మార్పుచేస్తే బాగుంటుంది. ప్రభుత్వం మద్యనిషేదం విధిచడం వల్లనే ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వం దీనిగురించి పునరాలోచించాలి ."

మొదటి రెండు వాక్యాలు పర్లేదు...మిగతా లైన్లతోనే తంటా వచ్చిపడింది. పోనీ పెద్దోళ్ళ మాటలను మీడియా వక్రీకరిస్తుంది అంటారుకదాని ఆ మాటలకుండగలిగే అర్థాలేంటో ఆలోచించాను. రెండు భావాలు చిరిగినాయి...అవి
మొదటిది:‘ప్రభుత్వం మద్యనిషేదం విధించింది కాబట్టి ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది.....ప్రజలు స్వచ్ఛందంగా మానుంటే సమస్య లేదు’
రెండవది: ‘ ప్రభుత్వం మద్యనిషేదం విధించింది కాబట్టే ఇదంతా.....నిషేదం ఏత్తేస్తే వారికి (జనానికి) చట్టబద్దంగా నాణ్యమైన మద్యం దొరుకుతుంది......మరణాలుండవు. so, నిషేదం ఎత్తేయాలి’
మెడకాయ మీద తలకాయున్న ఎవరికైనా మాల్యా మొదటి అర్థంతో చెప్పాడంటే నమ్మరు.
ప్రభుత్వం కాకపోతే ఎవరు నిషేదం విధిస్తారు...? ‘సేన’లా, మత సంస్థలా......నో ఛాన్స్‌. ఒకవేళ విధించినాకాని ఈ కింగ్‌లోళ్లే కేసు వేసిమరీ అమ్మించుకుంటారు.

నిషేదం ఉన్నాకాని సచ్చినోళ్ళు తాగి సచ్చారంటే.....శానా బాగా ఎడిక్ట్‌ అయ్యుంటారు. గవర్నమెంటు మందమ్ముకునే లైసెన్సు ఇచ్చుంటే నా బీరురంగా....... ఐ.పీ.ఎల్‌ అవసరం లేకుండానె కుప్పలుగా డబ్బులొచ్చేవని బహుశా కింగ్‌ అనుకొని ఉంటాడు. పైకి చెప్పలేక భారి డైలాగులు పేల్చాడు.
దీన్నిగూర్చి ఆలోచిస్తుంటే సామాన్య ప్రజలకు మన దేశంలో మద్యం అమ్మడం అవసరమా అన్న ప్రశ్న వచ్చింది. ఇది ఎందుకంటే మా ఏరియాలో బస్టాపు దగ్గరే ఓ మందు దుకాణం ఉంది. దానికి కొంచెం దూరంలో జూనియర్ కాలేజి ఉంది (ప్రభుత్వం నిర్దేశించిన దూరానికి ఓ పది మీటర్ల అవతల). సాయంత్రం అయ్యిందంటే దుకాణం దగ్గర జాతర జరుగుతుంది. పీకలదాకా తాగినోళ్ళు, తాగాలనుకుంటున్నోళ్ళు అంతా అక్కడే. అదే టైముకి కాలేజి వదలడం. ఆ బస్టాపులో ఎలా wait చేస్తారో వాళ్లు. సరిహద్దుల్లో ఉండే జవాన్లుకు, అపర దేవదాసులకైతే ఫరవాలేదు- అమ్మినా వాళ్ళ పనేదో అది చేసుకుపోతారు. ఎటొచ్చీ మిగతా వాళ్లకే అవసరమా. మానదా ఎదో కొన్ని నెలలు తప్పితే సంవత్సరాంతం చలి దారుణంగా ఉండే దేశంకాదు ( మందు బాబులను ఎందుకు తాగుతున్నావురా అంటే మూడొంతుల మంది చెప్పే జవాబు ఇదే- ఒళ్ళు వేడి చేసుకోడానికి) ఐనా తాగుతారు.... తాగి రభస చేయడానికి, ఎక్కువైనోడు చచ్చి ఇలా ఈవిధంగా ‘మద్య’వర్తిలు నోరొపారేసుకోడానికి, నాయకులుతో వారి కుటుంబాలు పరామర్శించబడటానికి.

మేఘసందేశం....ఓ వానాకాలం ఆలస్యంగా!

ఇది నా మేఘసందేశంకు కొనసాగింపు.....
వర్షాలు కురిసే ఉపాయాం చెప్పిన వారికి అగ్రహారాలు బహుమతిగా ఇస్తానన్న రాజుగారి ప్రకటనవిని ఓ పూజారి వచ్చాడు. తనకు అగ్రహారాలు ఏమి వద్దనీ ప్రజల బాధలుకు చలించిపోయి వచ్చానని చెప్పడు. సంతోషించిన రాజు వర్షాలు కురవాడినికి ఏం చేయలో చెప్పమన్నాడు. అందుకా పూజారి...
"రాజా...నా దగ్గర ఎటువంటీ ఉపాయమూలేదు. ఈ సమస్యకు పరిష్కారం మీవద్దనే ఉన్నది. మీకు దాన్నిచూపించడానికే నేను వచ్చాను"అని చెప్పాడు.
"ఏమిటీ, పరిష్కారం మావద్దనే ఉన్నదా..."రాజుగారితో సహా అందరూ ఆశ్చర్యపోతూ అనుకున్నారు.
"అవును రాజా...రాజ్యంలో ధర్మం సరిగా ఉంటే ప్రకృతి తన ధర్మం పాటిస్తుందంటారు. మీ రాజ్యంలో అది గతితప్పినట్టుంది, అందుకే ఈ వైచిత్రి..."చెప్పాడు పూజారి.
"ఏమిటి మా పరిపాలనలో ధర్మం గతితప్పినదా......నీవు ఏం మాట్లాడుతున్నవో తెలుస్తుందా...." ఒకింత ఆగ్రహంగా అన్నాడు రాజు.
"అవును రాజన్‌....కావాలంటే ఈ విషయం ఆ మేఘుడితోనే చెప్పిస్తాను" ఏ మాత్రం భయంలేకుండా చెప్పాడు పూజారి.

"మేఘుడితోనా....ఎలా"
"మాగురువుగారు నాకు నేర్పిన విద్య అది రాజా....మీరు ఒప్పుకుంటే మేఘుడిని పిలిపిస్తాను. ఆతనే చెప్తాడు మీ రాజ్యంలో ఎందుకు వర్షించడంలేదో" నివేదించాడు పూజారి.
"సరే....అలాగేకానిమ్ము. కాని ఒక్కటి గుర్తుపెట్టుకో.నీవు చెప్పిన విషయం ఋజువు చేయలేకపోయవో నీకు తగిన దండన విధించబడుతుంది" హెచ్చరిస్తూ ఒప్పుకున్నాడు రాజు.
"అలాగే రాజన్‌. రేపే మేఘుడిని పిలిపిస్తాను..."

అన్న ప్రకారం పూజారి తరువాతి రోజు ఏదో తంతు జరిపించాడు. అది అవగానే ఏదో ఆకాశవాణి వినిపించింది.
"రాజా చెప్పండి నానుండి మీరు ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారో...."
"ఎవరు....ఎవరిదా గొంతుక....ఎవరూ కనిపించరే..."
"పిలిచిమరీ ఎవరునువ్వూ అంటావేమిటయ్యా.....నేను మేఘుడిని. ఐనా పూజరి నాతో మాట్లాడిస్తానన్నాడుగాని చూపిస్తాననలేదుగా.....సందేహాలుమాని ఎందుకు పిలిచావో చెప్పు. అవతల నాకు బోల్డు పనులున్నాయి..."చెప్పాడు మేఘుడు.
"ఓ మేఘుడా....మా రాజ్యంలో నీవు వర్షించుటలేదు....అందుకుగల కారణమేమిటి" దిక్కులు చూస్తూ అడిగాడు రాజు.
"మీ రాజ్యం....పక్కవాడి రాజ్యం అని మాకు భేదాలు ఉండవు రాజన్‌....ఈమారు నేను చాలా రాజ్యాలలో వర్షించలేదు.."
"అదే ఎందుకని..."
"దారి దోపిడికి గురయ్యాను కనుక.." చెప్పింది ఆకాశవాణి.
"దారి దోపిడినా......? అవగతముగాకున్నది...విపులంగా చెప్పెదవా" అన్నాడు రాజు, పూజారి చెప్పింది అబద్దమని అనుకుంటూ....
అందుకేగా వచ్చింది. చెప్తావిను అని మొదలు పెట్టింది మేఘం.

"వర్షాకాలం మొదలవగానే అరేబియా సముద్రం నుండి నీళ్ళు తోడుకొని బాగా అలంకరించుకొని వర్షించడానికి బయలుదేరాను. ఓ మోస్తారు దూరం ప్రయాణించగానే దిగాలుగా కొందరు తారసపడ్డారు. దగ్గరకువెళ్ళి చూసాను. వాళ్ళు నేనెరిగినవాళ్లే. ఒకప్పుడు నాతోపాటే ‘గాల్లో’ తేలేవారు. అదిచూసి నేను వారు ఏ శాస్త్రజ్ఞులో, మానవరూపంలోవున్న గంధర్వులో అనుకునేవాడిని . తరువాత తెలిసింది వారిని ‘సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు’ అంటారని.
దిగాలుగా ఉన్నారు సంగతేంటో కనుకుందామని వేళ్ళా. అదేదో మాంద్యమట, దాని దెబ్బకు కొందరికి ఉద్యోగాలు ఊడినాయి, ఊడనివాడికి జీతాలు ఊడినాయి. ఆ వాతకి దిమ్మతిరిగి ఏడవటానికి ఒంట్లో నీళ్ళుకూడా లేవంట. నాతోపాటు కొన్నాళ్ళు ఉన్నారుగా, నా బలహీనతతెలిసి నేను మోసుకొస్తున్న నీళ్లు లాక్కున్నారు.మనసారా ఏడవటానికి... తెలిసినవాళ్లకే ఇచ్చానుకదా అని సరిపెట్టుకున్నాను.
అటునుంచి బయల్దేరి మీ నేలలో వచ్చానోలేదో.....అబ్బో ఏడుపులు, ఆర్తనాదాలు, కేకలు......మిగిలిన కాసిన్ని నీళ్లుకూడా సమర్పించుకోవాల్సి వచ్చింది..."

"ఏడుపులు, ఆర్తనాదాలా....?"

"అవును.....ఏడుపులే...పెట్రోల్‌ రేట్లు పెరిగి వాహనదారులు ఏడుస్తున్నారు.కాలుష్యం పెరిగి పాదచారులు ఏడుస్తున్నారు. నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుడు ఏడుస్తున్నాడు. స్కూలు ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, బండెడు పుస్తకాలు మోయలేక పిల్లలు ఏడుస్తున్నారు. పేరుగొప్ప కళాశాలల్లో చదివి ఉద్యోగాల్లేక విద్యార్థులు ఏడుస్తున్నారు.
ఎరువులు, గిట్టుబాటు ధరలేక రైతు ఏడుస్తున్నాడు. సీట్లరాక, వచ్చినా పదవిరాక నాయకులు ఏడుస్తున్నారు. నాయకులు చెప్పింది చెయ్యలేక అధికారులేడుస్తున్నారు. వీళ్లందరు కన్నిరు కార్చలేక ఏడుస్తున్నారు...బాధ బయటకి కక్కడానికి దారిచూపు దేవుడాఅంటే జాలిపడి తలాకొంత ఇచ్చాను.

భౌతికదాడులు, యాసిడ్‌దాడులు భరించలేక ఆడవాళ్లు లోలోపల ఏడుస్తున్నారు.వాళ్ళను చూసాక అడగకపోయినా నేనె నీళ్ళిచ్చెశాను. అయినా మీకు అదేం పోయెకాలమయ్యా..., ప్రేమించలేదనీ ఇష్టపడలేదనీ హింసిస్తున్నారే.....హవ్వ. ఇంత జరిగినా, ఇంకా జరుగుతున్నా ఏం చేయలేని మిమ్మల్ని చూస్తుంటే అసహ్యమేస్తుంది నాకు. అవకాశంవుంటే వాళ్ళమీది పిడుగైపడిపోదును.....కాని ఏం చేయను అందరికి పంచేసెసరికి బలం పోయింది.
నల్లగా నిగనిగలాడిపోతూ బయల్దేరిన నేను గాలి నింపుకున్న బుడగలాగా, జబ్బుపడ్డవాడిలాగా తెల్లగా పాలిపోయాను.
ఇది చాలదన్నట్టు మాంద్యం సమయంలో వనరులని నిరుపయోగం చెసానని మా పైఅధికారులు నా ఉద్యోగం ఊడపీకారు.....ఇప్పుడు నేను ఏడుస్తున్నాను....నీరులేక ఏడుస్తున్నాను" గోడు వెళ్ళబోసుకున్నాడు మేఘుడు.

"మరి మా వర్షాల సంగతి....." సందేహం వెలిబుచ్చాడు రాజు.
"ఉండవయ్యా.....నా ఉద్యోగంపోయి నేనెడుస్తుంటే నువ్వొకడివి. చెప్పానుగా నీళ్లు లేవని. మా జూనియర్లు కొందరు బయల్దేరారు...వాళ్లను ఏవరూదోచుకోకపోతే అప్పుడు చూద్దాం. ఈలోగా బంగాళాఖాతంలో కొన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంట. అక్కడ ప్రయత్నించిచూస్తా.దిరికితే వచ్చి వర్షిస్తా" చెప్పింది ఆకాశవాణి.
"మరి అప్పటిదాకా ఏం చేయమంటావ్‌. రాజుగా ప్రజలకు సమాధానంచెప్పాలిగా" అడిగాడు రాజు.
"ఆ...కప్పలు పడుతూకూర్చో. నువ్వు చేయగలిగింది అదొక్కటేగా..."
" !@#$%*&.." ఈసారి రాజుగారి మొహం తెల్లబోయింది.
************************************************

ఇప్పటికే ఋతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయట......సంతోషం.
ఈ కథతో టాపాని ఆలస్యంగా మొదలుపెట్టాను...మొదటి టాపా పోస్టు చేసేసరికి వర్షాలు మొదలయ్యాయి. విడగొట్టాను కాబట్టి ఈ పోస్టు రాయల్సొచ్చింది. దీనివల్ల ఓ వాక్యం నేర్చుకున్నా.... "నేను అచ్చేయల్సిన పోస్టు ఓ వానాకాలం లేటు" అని
( చిన్నప్పుడు తెలుగు పాఠం ‘ఆశ-నిరాశ’లో ‘నువ్వు ఎక్కవలసిన రైలు ఎప్పుడు ఓ జీవితకాలం లేటు’ అని ఉంటుంది. ఈ పాఠం రచయత పేరు గుర్తురావడంలేదు. మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు.)

మేఘసందేశం

అనగాఅనగా అనే ఒకవూర్లొ ఫలానా అనే రాజు ఉండేవాడు. ఆయనకి మరియు, మొదలగు అనే ఇద్దరు పుత్రరత్నాలు. ఓ రోజు ఫలానా రాజుగారి పుత్రులు దేశాటన ముగించుకొనివస్తూ తమతోపాటూ రెండు కప్పలను తీసుకొచ్చారు. ఇవేమిటని ప్రశ్నించిన రాజుగారితో తమకు ఓ సన్నాసి (తెలుగు సినిమా సన్నాసి కాదులేండి.....) కానుకగా ఇచ్చాడనీ, ఇవి ఎక్కడ ఉంటే అక్కడ సిరిసంపదలు విరజిల్లుతాయనీ చెప్పాడని చెప్పారు. ఇంకా ఇవి దివ్యమండూకములనీ వీటిని మంచినీటి బురదలోనో, కొలనులోనో పెంచవలసిందిగా ఉపదేశించారనిన్ని సెలవిచ్చారు.
దివ్యమండూకాలని, సన్నాసి ప్రసాదమని తెలుసుకున్నరాజుగారు వాటి సంరక్షనా బాధ్యతలను ఓ సేవకుడికి అప్పగించాడు. సేవకుడు వాటిసేవలో తరించిపోతున్నాడు.....

వేరే ఒక రోజు విశ్రాంతి తీసుకుంటున్న రాజుగారు ఏదో శబ్దాలకు నిద్రలేచారు.
బెక......బెక.....బెక.....బెకమని గదిలో అటూ-ఇటూ గెంతూతూ పుత్రరత్నాలు తెచ్చిన కప్పలు కనిపించాయి. కొలనులో ఉండాల్సిన కప్పలు ఇలా గదిలోపలికి ఎందుకువచ్చాయా అనుకుంటూ "కప్పలారా....కప్పలారా ఎందుకు కొలనులోంచి బయటకి వచ్చారు" అని అడిగాడు.
" హే ఫలానా రాజన్‌ ఫలానా రాజన్‌, నీకు తెలుసునుకాదా మేము దివ్యమండూకములని......మేము మంచినీటిలోనే నివసించెందమనీ. కానీ మా సంరక్షకుడు గతకొంతకాలంగా సరిగా చూసుకొనుటలేదు....మంచి నీరు అందించుటలేదు.....బెక.........బెక" అని వాపోయాయి. ఇది విన్న రాజుగారు వేంటనే ఆ సేవకుడిని పిలిపించి
"సేవకా......సెవకా.......నీకు ఈ దివ్యమండూకములను సరిగా చూసుకోవలెనని ఆజ్ఞాపించినాము కదా.....మరి నీవు వీటికి మంచినీరు ఎందుకు అందించుటలేదు" అను అడిగాడు.
"రాజా రాజా.....నా విధినిర్వాహణలో ఎలాంటి దోషమూలేదు. నేను వీటికి మన ఆస్థాన జలగుత్తేదారు సరఫరా చేసేనీటినే వాడుతున్నాను. గతకొంతకాలంగా అతను ఇచ్చేనీటిలో తేడాకనపడుతున్నది. దానివలనే ఈ సమస్యనుకుంటా ప్రభూ"అన్నాడు.
"అయితే వెంటనే ఆతణ్ణి పిలిపించండి".
"చిత్తం ప్రభూ" అని గుత్తేదారుని తీసుకువచ్చాడు.

"గుత్తేదారా గుత్తేదారా.......ఎందుకు నీవు మంచినీరు సరఫరా చేయుటలేదు" అని రాజు నిలదీశాడు.
"రాజా రాజా.....ఇందులో నా దోషము ఇసుమంతైనైనూలేదు. రాజ్యంలో వర్షాలు కురవడంలేదు. అందుకని నేను వేరే రాజ్యంనుండి నీటిని కొని మీకు పంపిస్తున్నాను. కొంతకాలంగా మీకు భోలక్‌పూర్‌ అను రాజ్యం నుండి తెచ్చిన నీటిని సరఫరా చేస్తున్నాను.....అక్కడి ప్రజలు అవే త్రాగుతారట. పైగా ఆ నీరు అక్కడి జలమండలి వారు ఎన్నో వ్యయప్రయాసలోర్చి సరఫరా చేస్తారట. ప్రజలు తాగి జీవించగాలేంది కప్పలు జీవించలేవాని ఆ నీటినే ఇచ్చాను ప్రభూ" సెలవిచ్చాడు గుత్తేదారు.
" ఊమ్... అనవసర విషయాల ప్రస్తావన ఏల. రాజ్యంలో వర్షాలు కురవడంలేదా....ఈ సంగతి మాకుతెలియనేలేదే. ఏమీవిపత్కర పరిస్థితి. ఏమి దీనికి పరిష్కారము.."మధనపడిపోతూ మంత్రిగారిని పిలిపించాడు.

"మంత్రీ మంత్రీ.....మన రాజ్యంలో సకాలంలో వర్షాలు కురవడంలేదట. ఈ విషయం ప్రజలు చెబితే తెలిసినది. ఎందుకు నాకు తెలియపరచలేదు" అన్నాడు మంత్రితో.
"రాజా రాజా......నాకునూ ఇప్పుడె తెలిసినది ఆ సంగతి. వేరే వ్యాపకాలలో ఉన్నందున సరైన సమాచారం అందలేదు. ఏమైననూ ఇప్పుడున్న సమస్య ఝటిలమైనది. దీనికి ఒకే ఉపాయమున్నది"
"ఏమది..."
"పొరుగు రాజ్యాలలో మేఘమధనమని ఓ ప్రక్రియను అవలంభిస్తున్నారు. వాటివల్ల ప్రయోజనమొనగూరవచ్చు" తరుణోపాయం వివరించాడు మంత్రి.
అట్లయినచో, వెంటనే మేఘమధనం జరిపించండనీ రాజుగారు ఆజ్ఞాపించి తన విశ్రాంతి మందిరానికి వెళ్ళిపోయాడు.
కప్పలు వాటికి వచ్చిన లాంగ్‌జంప్‌ ఆటలో ఆరితేరి వాటి దారిలో వచ్చినవాటిని బెక......బెక....బెకమనిపిస్తున్నాయి

రాజాజ్ఞ ప్రకారం మంత్రి మేఘమధనం జరిపించాడు. ఎంత మధించినా ఫలితం శూన్యం. వానలు ఇల్లె. రాజుగారు విషయం తెలుసుకొని విచారపడ్డాడు. గమనించిన మంత్రి రాజుతో ఇది దైవసంబంధ విషమైవుండవచ్చుననీ ఆస్థాన పురోహితుడిని పిలిపించమని నివేదించాడు. అలాగే కానిమ్మన్నాడు రాజు. మరుసటిరోజు సభకి రాజపురోహితుడు వచ్చాడు.
"పురోహిత పురోహిత.......వర్షాలు ఎందుకు పడటంలేదు. నీకేమైన ఎరుకనా. పరిష్కారమేమైనా ఉన్నాదా..." అని పురోహితుడిని అడిగాడు.
"రాజా రాజా......."పురోహితుడు ఏదో చెప్పబోతూ కప్పల శబ్దం విని ఆగాడు.
బెక......బెక.....బెక.....బెక....
"రాజా...రాజా..."
బెక....బెక.....బెక...బెక.....
పురోహితుడికి విసుగొచ్చింది. అది గ్రహించిన రాజు వాటిని పట్టించుకోకుండా కానిమ్మన్నాడు.
"రాజా....రాజా..... మీరు కొన్ని సంవత్సరాలుగా యజ్ఞ-యాగాదులేవియూ జరిపించలేదు. అందువలనే ఈ వైపరిత్యము సంభవించినదని నా అభిప్రాయము. ఈ సమస్య తీరవలెనన్న వేయిమంది విప్రోత్తములచే వరుణయాగం జరిపించవలె"నని రాజుగారికి విన్నవించాడు పురోహితుడు.
బెక....బెక....బెక....బెక......
"యజ్ఞము చేసిన వర్షము వచ్చునా....."రాజుగారు సందేహం వెలిబుచ్చాడు.
"ముందు పొగొత్తది......"వెనకనుండి పురోహితులవారి శిష్యగణం నుండి వినిపించింది.
రాజుకి ఒళ్ళుమండి " అసంధర్బ ప్రేలాపనలు కట్టిపేట్టి ముందు ఆ యాగం సంగతి చూడండి. ఈ కప్పల గోల భరింపనలవిగాకున్నది. పైగా ఇవి అన్ని కప్పలవలే 'బెక బెక' మనక 'బెక' అనిమాత్రమే అరుస్తున్నవి....కటకటా..."

పురోహితుడు చెప్పిన ప్రకారం యాగం చేయించాడు రాజు........ఇప్పుడు కూడా ఫలితం సున్నా. కప్పలు మాత్రం ఆ పొగకి రెచ్చిపోయి మరింత బెక....బెక పెడుతున్నాయి.
సిరిసంపదల సంగతి దేవుడెరుగు ముందు వర్షాలు పడి ఈ కప్పగెంతులు ఆగితే బావుణ్ణు అనుకొని వర్షం కురిసేలా చేసిన వారికి పాతిక అగ్రహారాలు బహుమతిగా ప్రకటించాడు.

(ఇంకా బెక....బెక ఉంది)

ShareThis